Sunday 28th of April 2024

సుదీర్ఘ వివాదానికి తెర

15 Dec , 2023 12:43 , IST
Article Image

జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్‌ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పుపై సహజంగానే అటు హర్షామోదాలతోపాటు ఇటు అసంతృప్తి, అసమ్మతి కూడా వ్యక్తమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించగా, కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీలు నిరాశ వ్యక్తంచేశాయి.దశాబ్దాలుగా ఈ అధికరణ చుట్టూ సాగుతున్న వివాదానికి తాజా తీర్పు ముగింపు పలికింది. 370వ అధికరణ రద్దు సహా అన్ని విషయాల్లోనూ ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పు వెలువరించగా దానితో ఏకీభవిస్తూనే జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చారు.ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమే. కశ్మీర్‌ వంటి భావోద్వేగాలతో ముడిపడివుండే అంశంలో వీటి తీవ్రత కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్లే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాదం వేళ్లూన డానికీ, భద్రతాబలగాలపై దాడులకూ మూలం 370వ అధికరణలో ఉందన్నది జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచీ బీజేపీ నిశ్చితాభిప్రాయం.దానికితోడు పాకిస్తాన్, చైనా సరిహద్దుల సమీపంలో ఉండటంవల్ల కశ్మీర్‌ ఘటనలు దేశ పౌరులందరినీ కలవరపరుస్తుంటాయి. అయితే అధికరణ రద్దుపై స్థాని కులు ఏమనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలియదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్లవుతోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌ ప్రాంతంలోని మూడు స్థానాలనూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గెలుచుకోగా, జమ్మూ ప్రాంతంలోని మూడు స్థానాలు బీజేపీకి లభించాయి..