కేంద్ర ప్రభుత్వం జమ్మూ –కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికర ణాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అధ్యక్ష తన న్యాయమూర్తులు ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ బెంచి కీలకమైన తీర్పును వెలువరించింది. దేశ సమగ్రతను పరిరక్షించాలంటూ సొలిసిటర్ జనరల్ ‘సమర్థవంతంగా’ వాదించడంతో ఒకే ఒక్క అంశం మినహా అన్ని అంశాలలో అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాదన లతో పూర్తిగా ఏకీభవించింది. రాజ్యాంగ నిపుణులూ, ‘రూల్స్ ఆఫ్ లా’ తెలిసిన వాళ్లూ తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఈ 370 అధికరణ రద్దుపై తీర్పు దాదాపు అన్ని వాదాలనూ అంగీకరించింది. అయితే ఆర్టికల్ 370 రద్దు కోసం ఆర్టికల్ 367ను సవరించడం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొ నడం గమనార్హం. సుప్రీంకోర్టు చర్చించిన ఎనిమిది ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. అయితే అందులో 6వ అంశాన్ని నిశితంగా పరీక్షించాల్సి ఉంది. ఈ అంశాన్నే కోర్టు తప్పు పట్టింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం కోసం ఆర్టికల్ 367ను సవరించడం మొత్తం చట్టపరమైన ప్రక్రియకు కీలకమైనది. అయితే ఈ సవరణ చట్టబద్ధం కాదని న్యాయమూర్తుల ధర్మపీఠం పేర్కొంది. ఆర్టికల్ 367 అనేది ఇంటర్‌ప్రెటేషన్ (వ్యాఖ్యానించే లేదా వివరించే) క్లాజ్ మాత్రమే. అంతేకానీ అది డెఫినిషన్‌ల (నిర్వచనాల)ను సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయంగా చూపే) చేసే క్లాజ్ కాదు. అందుకే 1954లో జమ్మూ– కశ్మీర్‌కు అనువర్తించేలా తెచ్చిన కాన్‌స్టిట్యూషనల్ ఆర్డర్ (సీఓ) 272 ప్రకారం ఆర్టికల్ 370 రద్దు కోసం ఆర్టికల్ 367ను సవరించడం చట్టవిరుద్ధం అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు తీర్పు లోని అంశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమ వుతుంది.ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన విస్తృతమైన తీర్పులో సీఓ 272 ఉద్దేశ్యం ఆర్టికల్ 367లో మార్పులు చేయడానికి అన్నట్టుగా మొదట కనిపించినా, అది సమర్థంగా ఆర్టికల్ 370ని పూర్తిగా మార్చివేసిందని పేర్కొన్నారు. ఈ మార్పులు గణనీ యంగా బలమైనవీ, స్థిరమైనవనీ కోర్టు పేర్కొంది. సవరణ ప్రక్రియలో రాజ్యాంగ నియమ భంగం చేస్తూ ఒక అధికరణాన్ని రద్దు చేయడానికి ఇంటర్ర్ పెటేషన్ క్లా్లజ్ (వ్యాఖ్యాన నిబంధన)ను సవరించే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒక రాజ్యాంగ సవరణకు నిర్దేశిత మార్గాన్ని తప్పించుకునేందుకు ఇంటర్‌ప్రెటేషన్ క్లాజ్‌ను ఉపయోగించే అధికారం లేదు కనుక ఆర్టికల్ 367ని ఆశ్రయించి ఆర్టికల్ 370కి చేసిన సవరణలు చట్టబద్ధం కాదని నిర్ధారించామనీ, ఇటువంటి అక్రమమైన పద్ధతుల ద్వారా సవరణ లను అనుమతించడం దురదృష్టకరం అనీ సుప్రీంకోర్టు పేర్కొంది.ఆర్టికల్ 370 (1) (డి) కింద అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్ 370ని సవరించే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సీజేఐ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, ఆర్టికల్ 367ను ఉపయోగించి 370ని సవరించే విషయంలో ఒక పద్ధతిని నిర్దేశించారనీ, దానిని అనుసరించకుండా దొడ్డి దారిలో అక్రమ మార్గం నుంచి సవరణ అనుమతించడం సరికాదనీ జస్టిస్ ఎస్కే కౌల్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. మొదటగా ‘సీఓ272’గా ప్రాచుర్యం పొందిన రాజ్యాంగపు (జమ్మూ–కశ్మీర్ అనువర్తిత) ఉత్తర్వు– 1954ను రద్దు చేసి, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ–కశ్మీర్‌కు వర్తి స్తాయని ప్రకటించింది. రెండవ దశలో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 367ను కూడా సవరించి, 370 ఆర్టికల్ రద్దుకు మార్గం వేసుకొంది. .