Monday 29th of April 2024

రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే...

15 Dec , 2023 12:51 , IST
Article Image

16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్స్) నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్స్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్‌–19 ప్రేరేపించిన ఆర్థిక షాక్‌లు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతలను పరిశీలించి, ఆర్థిక పరిష్కారాలను అందించాలి. 2022–23లో కేంద్రం, రాష్ట్రాల సంయుక్త లోటు, అప్పులు వరుసగా 10 శాతం, 89 శాతంగా ఉన్నాయి. కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనే క్షితిజ లంబ(వెర్టికల్‌) వాటాలనూ, దాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే క్షితిజ సమాంతర(హారిజాంటల్‌) వాటాలనూ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. కేంద్ర పన్నుల భాగస్వామ్య పూల్‌లో రాష్ట్రాల వాటాలను 14వ ఆర్థిక కమిషన్స్ 32 నుండి 42 శాతానికి పెంచింది. అయితే రాష్ట్రాల సంఖ్యను 28కి తగ్గించినప్పుడు, రాష్ట్రాల వాటాను 41 శాతంగా 15వ కమిషన్స్ సిఫార్సు చేసింది. 2022–23లో 6.5 శాతం ఆర్థిక లోటు, 58 శాతం అప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమతుల్యతతో ఉన్నందున ఈ వాటాను పెంచే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.అయితే, 16వ ఆర్థిక కమిషన్స్ సెస్సులు, సర్‌ఛార్జీల అంశాన్ని పరిశీలించాలి. 2011–12లో ఉన్న 10 శాతం నికర పన్ను రాబడి (జీటీఅర్‌) నుండి 2019–20కి 20 శాతానికి పెరిగింది. వాస్తవానికి, కేంద్ర జీటీఅర్‌లో రాష్ట్రాల నిష్పత్తి 2018–19లో ఉన్న 36.6 శాతం నుండి 2022–23లో 30.2 శాతానికి తగ్గింది. సెస్సులు, సర్‌చార్జ్‌ల కోసం 10 శాతం జీటీఅర్‌ గరిష్ఠ పరిమితిగా ఉండాలని రంగరాజన్, శ్రీవాస్తవ సూచించారు. కమిషన్స్ దీనిని సిఫారసు చేయవచ్చు. అది 10 శాతాన్ని దాటితే, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను పెంచవచ్చు. మరో మాటలో చెప్పాలంటే– సెస్సులు, సర్‌ఛార్జ్‌ల వాటాపై ఆధార పడి క్షితిజ లంబ వాటాను మార్పు చేయవచ్చు. 16వ ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన ఇతర అంశాలు: సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, మానవాభివృద్ధిని మెరుగుపరచడం, రెవెన్యూ లోటు గ్రాంట్ల పరిశీలన, స్థానిక సంస్థలకు నిధుల బదిలీ, కేంద్రం, రాష్ట్రాలు రెండూ అందిస్తున్న ఉచితాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) పునరుద్ధరణ. సీఎస్‌ఎస్‌ విషయానికొస్తే, రాష్ట్రాలు మరింత సరళతతో పథకాల రూపకల్పనలో పాల్గొనవచ్చు. ఆదాయ వ్యయాల శాతంగా ఉచితాలపై కొంత పరి మితి ఉండాలి. ఉచితాలపై సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్థిక నియమాల ఆధారంగా రుణాన్ని, ఆర్థిక స్థిరత్వ విశ్లేష ణను అందించడానికి స్వతంత్ర ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి.చివరగా, సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్యా లను సాధించడంలో రాష్ట్రాల పాత్ర సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనది. రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. విద్య, ఆరోగ్య వ్యయంలో 70 శాతం, మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు ఖర్చు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులలో 79 శాతం మందిని రాష్ట్రాలు నియమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతర్రాష్ట్ర అసమానతలను తగ్గించడంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ముఖ్యమైనవి..