Tuesday 14th of May 2024

ప్రణాళికతోనే కెరీర్‌ బంగారం

15 Dec , 2023 03:30 , IST
Article Image

మనీష్‌ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్‌ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు.ఆద్య చదివే కోర్స్‌ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్‌ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్‌ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి.ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్‌ ఎకనామిక్స్, కాగ్నిటివ్‌ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్‌ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్‌ డిజైనింగ్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)కు ఆదరణ పెరుగుతోంది.ఎక్కువ శాతం కెరీర్‌ ఆప్షన్లు సోషల్‌ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్‌ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఓవర్‌సీస్‌ అడ్మిషన్స్‌ సంస్థ అధినేత శిరీష్‌ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్‌ ఎనర్జీ, కంటెంట్‌ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. .