Tuesday 14th of May 2024

అర్థవంతమైన జీవితం

15 Dec , 2023 04:18 , IST
Article Image

‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్‌ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్‌ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్‌ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్‌ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్‌ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్‌ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్‌ఎస్‌ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసి రిజల్ట్స్‌ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్‌ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్‌ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్‌ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్‌ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్‌ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్‌ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. .