Tuesday 14th of May 2024

లెక్కల్లో మరీ ఇంత వీకా..!

13 Dec , 2023 11:39 , IST
Article Image

ప్రముఖ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీపై విషంకక్కుతున్న రామోజీఅవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలపై రామోజీరావు విషం చిమ్ముతున్నారు. తప్పుడు లెక్కలు వేసి.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతోందంటూ ప్రజలను మభ్య పెట్టడానికి మరోసారి విశ్వప్రయత్నం చేశారు. ఆసియాలోనే ప్రముఖ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీ ఇండోసోల్‌పై ‘రూ. 47,809 కోట్లు దోచి పెడుతున్నారు’ అంటూ సోమవారం మరోసారి ఈనాడులో తప్పుడు రాతలు రాశారు.పరిశ్రమలన్నిటికీ రాయితీలు ఒకేలా వర్తిస్తాయని, ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉండవని తెలిసి కూడా అవాస్తవ కథనాన్ని ప్రచురించారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు రూ. 59,958 కోట్ల పెట్టుబడులను ఇండోసోల్‌ పెడుతోంది. తద్వారా ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాసిన ఆ కథనంలో ఉన్నవన్నీ అబద్ధాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వితేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. సీఎండీలు వెల్లడించిన అసలు నిజాలు ఇలా ఉన్నాయి.  ఈనాడు తన కథనంలో చెప్పినట్టుగా పరిశ్రమల రంగంలో గరిష్ట డిమాండ్‌ చార్జీలు కలిపి సగటున యూనిట్‌కు రూ. 12గా విద్యుత్‌ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయనడం పూర్తిగా అబద్ధం. 11కేవీ స్థాయిలో ఎనర్జీ ఇంటెన్సివ్‌ పరిశ్రమలకు సరాసరి విద్యుత్‌ చార్జీ యూనిట్‌ రూ. 6.50 కాగా, ప్రస్తుతం విధిస్తున్న ఇంధన సర్దుబాటు చార్జీలు దీనికి అద­నం. ఈ ఇంధన సర్దుబాటు చార్జీలు నిరంతరం ఉండవు. గడువు అయిపోగానే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఫెర్రోఅల్లాయ్‌ పరిశ్రమలు, ఫొటో ఓల్టాయిస్‌(పీవీ) ఇంగోట్‌–సెల్‌ తయారీ పరిశ్రమలు, పోలీ సిలికాన్‌ పరిశ్రమలు, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి.  ఇండోసోల్‌ పరిశ్రమ సమర్పించిన ప్రాజెక్టు వివరాల ప్రకారం అది అత్యధిక పరిమాణంలో విద్యుత్‌  వినియోగించే పరిశ్రమ. ఇప్పుడు అమలులో ఉన్న అత్యధిక వోల్టేజీ స్థాయి 220 కేవీ కన్నా  ఎక్కువగా 400 కేవీ స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరగబోతోంది. అయినా గ్రిడ్‌పై ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉండగలదు. దానితో ఇది దృఢమైన గ్రిడ్‌ నిర్వహణకు దోహద పడుతుంది..